
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు కల్చరల్: జిల్లాలో ఈనెల 16న ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారని, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. నన్నూరు టోల్‌గేట్ వద్ద సభా ప్రాంగణం, హెలిపాడ్ ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాని వచ్చే దారిలో బ్యారికేడింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. సభ ప్రాంగణంలో హెలిపాడ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు భరత్ గుప్తా, శౌర్యమాన్ పటేల్, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర భరద్వాజ్, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఐఏఎస్ అధికారులు, జేసీలు, సబ్ కలెక్టర్లు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు
కర్నూలు: ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సెక్టార్, లైజనింగ్ పోలీసు అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ గురించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ గురించి, వీఐపీ కాన్వాయ్ రూట్, ఏఏ నియోజక వర్గాల నుంచి ఎంతమంది ప్రజలు వస్తున్నారని క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే విషయాల గురించి జియోగ్రాఫికల్ మ్యాప్‌లు చూపిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రతి సెక్టారు ఇన్‌చార్జీ, లైజనింగ్ ఆఫీసర్ విధి నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు.
● ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను నాగలాపురం దగ్గర రూట్ మళ్లించాలన్నారు. బస్తిపాడు. చిన్నటేకూరు, తడకనపల్లి మీదుగా రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
● డోన్, ప్యాపిలి, పత్తికొండ, తగ్గలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు హైవేలో రాగమయూరి దగ్గరకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
● నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
● పార్కింగ్ ప్రాంతాల్లో ఆయా నియోజక వర్గాల ఇండికేషన్ సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
● సమావేశంలో ఐపీఎస్ అధికారులు పరమేశ్వరరెడ్డి, దేవరాజ్, మాధవరెడ్డి, దీపికాపాటిల్, జి.కృష్ణకాంత్ పటేల్, శ్రీనివాసరావు, మణికంఠచందవోలు, దీరజ్‌కునిబిల్లి, చక్రవర్తి, లక్ష్మినారాయణ, ట్రైనీ ఐపీఎస్‌లు అడిషినల్ ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.