
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకుని ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
కర్నూలు కల్చరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈనెల 13వ తేదీ సోమవారం జిల్లాలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమాన్ని (పీజీఆర్‌ఎస్) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో జిల్లా అఽధికారులు, ఉద్యోగులు నిమగ్నమైనందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దయిందని కలెక్టర్ పేర్కొన్నారు.
14న విద్యుత్ ఉద్యోగుల వర్క్‌టురూల్
కర్నూలు(అగ్రికల్చర్): జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 14న వర్క్ టు రూల్ ప్రకారం విధులు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 3500 మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తుండగా సోమవారం 2500 మంది సెలవు పెట్టి చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లారు. కాగా.. ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇది వరకే నిర్ణయించింది.