
గురుకులాల్లో వసతులు మెరుగుపరచాలి
జూపాడుబంగ్లా: సాంఘిక సంక్షేమశాఖ అంబేడ్కర్ గురుకుల పాఠశాల్లో వసతులు మరింత మెరుగుపరచాలని ఆశాఖ సెక్రటరీ ప్రసన్నవెంకటేశ్ అన్నారు. శుక్రవారం ఆయన జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంటును చూసి మరమ్మతులు చేయించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలని ఆదేశించారు. తరగతిగదిలోనే విద్యార్థుల పెట్టెలు, బట్టలు ఉండటాన్ని చూసి డార్మెట్రీ లేదా అని డీసీఓ శ్రీదేవి, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తిని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా డార్మెట్రీ లేదని, తరగతి గదులనే డార్మెట్రీగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించి డార్మెట్రీ వెనుకభాగం అపరిశుభ్రంగా ఉండటంతో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు తెచ్చిన అరటిపండ్లను పరిశీలించి నాసిరకమైనవి ఎందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలని, ఏదైనా పొరపాట్లు జరిగితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.