
సమన్వయంతో పీఎం పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం ఆమె ప్రధానమంత్రి పర్యటించే నన్నూరు సమీపంలోని రాగమయూరి వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా అధికారులతో సమీక్షించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలసి పీఎం సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పార్కింగ్ ప్రదేశాల్లో 11వ తేదీలోపు అంతర్గత రహదారులను నిర్మించాలని ఇన్‌చార్జీలుగా ఉన్న ఇరిగేషన్, పీఆర్ ఎస్‌ఈలు, హౌసింగ్ పీడీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈలను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతం, నన్నూరు టోల్‌గేట్‌లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బస్సుల్లోనే వచ్చిన వారికి భోజనం, నీటిని అందించాలని డీఎస్‌ఓ రాజారఘువీర్‌కు సూచించారు. స్టేజీకి కుడి పక్కన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్యామూల్ పాల్‌కు తెలిపారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు సందీప్‌కుమార్, భరత్ నాయక్‌లు పాల్గొన్నారు.