
పంట పొలాల్లో చిరుత సంచారం
ఆలూరు: ఆస్పరి మండలం జొహరాపురం, ఆలూరు మండలం మొలగవెల్లి, పెద్దహోతూరు గ్రామాల పంటపొలాల్లో మూడు రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాసులు, ఎఫ్‌ఆర్‌ఏ తేజస్విణికి ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సిబ్బందితో కలసి బీట్ అధికారులు బాలకృష్ణ, విమల్ కుమార్ జొహరాపురం పంట పొలాల్లో చిరుత పాద ముద్రలను పరిశీలించారు. రైతులు, ప్రజలకు పంట పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
ఎల్లెల్సీకి కోటా నీటిని అందిస్తాం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు సంబంధించి ఆంధ్రా కోటా నీటిని పూర్తిస్థాయిలో అందిస్తామని, జలచౌర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీబీ బోర్డు చైర్మన్ ఎస్‌ఎన్ పాండే, సెక్రటరీ ఓఆర్‌కె రెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ నారాయణనాయక్ తెలిపారు. దిగువ కాలువపై బుధవారం వారు పర్యటించారు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందో లేదో తెలుసుకున్నారు. అక్విడేటర్లు, అండర్‌టెన్నల్(యూటీ) లను పరిశీలించి వాటి ద్వారా బయటకెళ్తున్న నీటి గురించి ఆరా తీశారు. కాలువ పక్కన ఉన్న పొలాలకు అక్రమంగా నీటిని మళ్లించుకోకుండా(సైఫింగ్) తగిన చర్యలు తీసుకోవాలని సెక్షన్ ఆఫీసర్లను అదేశించారు. వారి వెంట ఎస్డీఓలు హుసేన్‌బాషా, సురేష్‌బాబు ఉన్నారు.
8 చెరువుల్లో పూడికతీత పనులు
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలోని వివిధ చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఇందుకోసం రూ.36.64 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు ఉపాధి నిధులతో చేపట్టే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సీ.బెలగల్ మండలంలో 3, గూడూరు మండలంలో రెండు, ఆదోని, చిప్పగిరి, వెల్దుర్తి మండలాల్లో ఒక్కొక్కటి ప్రకారం 8 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
10న పారామెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో డిప్లమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ కోర్సులకు ఈ నెల 10న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కళాశాలలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటర్ ఒరిజినల్ మార్క్స్’ మెమో లేని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు.
భూసంరక్షణ అక్రమాలపై విచారణాధికారి నియామకం
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూ సంరక్షణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఆయన సాగించిన అక్రమాలపై సమగ్ర విచారణకు విచారణాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.36 లక్షలు కొల్లగొట్టారు. అనుమతి లేకుండానే అద్దె వాహనాలు వినియోగించారు. సెల్ఫ్ చెక్‌లతో నిధులు స్వాహా చేశారు. అక్రమాలపై ఈ ఏడాది జనవరిలో 14 ఆభియోగాలు నమోదయ్యాయి. తాజాగా వ్యవసాయ శాఖలో అడిషనల్‌మ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్‌చంద్‌ను విచారణాధికారిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 నుంచి దాదాపు మూడేళ్లపాటు భూసంరక్షణ విభాగం ఆదోని ఏడీఏగా పనిచేస్తున్నప్పుడు నిధులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారు. వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయిన రామునాయక్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా రైతుశిక్షణ కేంద్రం డీడీఏగా ఉన్నారు.

పంట పొలాల్లో చిరుత సంచారం