
టీడీపీ నాయకుడి నుంచి ప్లాట్లకు రక్షణ కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): 20 ఏళ్ల క్రితం కల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 292లో ఉన్న 3.95 ఎకరాల్లో డీటీసీపీ అప్రూవల్ లేవుట్‌లోని తమ ప్లాట్లను టీడీపీ నాయకుడు పోలిశెట్టి దేవేంద్రకుమార్ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు కృష్ణమూర్తి, నరసింహరావు, రాజు, వెంకటేష్ అధికారులను కోరారు. టీడీపీ నేత నుంచి తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆ లేవుట్‌లో దాదాపు 30 మంది ప్లాట్లను విక్రయించారని, అందులో చాలా మంది ఇళ్లు కట్టుకొని కూడా నివాసం ఉంటున్నారన్నారు. అయితే ఆ స్థలం తమ తాతల ఆస్తి అంటూ టీడీపీ నాయకుడు పోలిశెట్టి దేవేంద్రకుమార్ ఆక్రమించుకునేందుకు ఇటీవల జేసీబీతో వచ్చి సైడ్‌వాల్స్‌ను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ఆయన నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ స్థలం కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను చూపించారు.