
భద్రత కట్టుదిట్టం
● పోలీసు అధికారులతో సమీక్షలో అడిషనల్ డీజీ
కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయాలని అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. పీఎం పర్యటన ఏర్పాట్లపై ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న ఏరో వన్ ఫంక్షన్ హాల్‌లో ఐజీ, డీఐజీలు, ఎస్పీలతో మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట గూగుల్ రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ శివా రులో ఉన్న రాగమయూరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, ఇతర ప్రదేశాల గురించి పర్యటన వివరాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, హెలి ప్యాడ్, బహిరంగ సభ, వాహనాల డైవర్షన్స్ తదితర విషయాల గురించి అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. మోడీ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఆపై స్థాయి అధికారులు మాత్రమే ప్రధా ని పర్యటన బందోబస్తు విధులకు కేటాయించాలన్నారు. విధులకు కేటాయించిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించే రాగమయూరి ప్రాంతంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. సమావేశంలో ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, సెంథిల్ కుమార్, సత్య ఏసుబాబు, ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీలు షెల్కేనచికేత్ విశ్వనాథ్, కృష్ణకాంత్, మణికంఠ చందవోలు, దేవరాజు, ధీరజ్ కునుబిల్లి, దీపిక పాటిల్‌తో పాటు అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, ఇంటెలిజెన్స్ అధికారులు, సీఐలు, ఆర్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

భద్రత కట్టుదిట్టం