
నకిలీ మద్యం విక్రయాలపై దృష్టి సారించండి
కర్నూలు: అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, విజయవాడలోని ఇబ్రహీం పట్నం వద్ద పట్టుబడిన నకిలీ మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తనిఖీలు విస్తృతం చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. కర్నూలులోని ప్రధాన కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లతో ఆమె నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించిన గ్రామాల్లో తిరిగి నాటుసారా తయారు కాకుండా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పాత కేసుల్లో ముద్దాయిలను బైండోవర్ చేసి వారి ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా నిరంతరం దాడులు కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ జిల్లా అధికారి మచ్ఛ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్‌లతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.