
ఆటోను ఢీకొట్టిన కారు
● ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో ఇద్దరికి గాయాలు
మహానంది: నంద్యాల – మహానంది రహదారిలో బుక్కాపురం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపురం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బుక్కాపురం మలుపు వద్ద వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్ టేక్ చేయబోయి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పుట్టుపల్లె పాఠశాల ఉపాధ్యాయురాలు రాఘవేంద్రమ్మ, అబ్బీపురం ఉపాధ్యాయురాలు ఉమా మహేశ్వరమ్మలతో పాటు ఆటో డ్రైవర్ బాలస్వామి, ప్రయాణికుడు పుట్టుపల్లెకు చెందిన జయరాముడు తీవ్రంగా గాయపడ్దారు. అదే సమయంలో నంద్యాల నుంచి వస్తున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద ఘటన చూసి చలించి వెంటనే పోలీస్ వాహనంలో గాయపడిన వారికి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. అనంతరం వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, ఓనర్ ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.