
మతోన్మాదులను కట్టడిచేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం
కర్నూలు(సెంట్రల్): మతోన్మాదులను కట్టడి చేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరి నాథ్‌చౌదరి, వెంకటేశ్వర్లు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఖండించాయి. ఆయనకు మద్దతుగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాది ఉద్దేశపూర్వకంగా కోర్టులో మత నినాదాలు చేస్తూ దాడికి పాల్పడడం మంచి పద్ధతి కాదని సీనియర్ న్యాయవాది జయరాజు అన్నారు. ఆయనన్ను న్యాయవాద వృత్తి నుంచి తొలగించాలని కోరారు. తనపై దాడి జరిగినా కోర్టును కొనసాగించిన ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అత్యున్నత పదవికి ఇచ్చిన గౌరవమని, ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు.
తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తిహక్కు కోల్పోతారు
కర్నూలు(అర్బన్): వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు చేయూతనివ్వకపోతే ఆస్తి హక్కు కోల్పోతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం జిల్లా హార్టిక్చలర్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన ప్రపంచ వృద్ధుల దినోత్సవ వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా ఒకస్థాయి లో ఉన్న వృద్ధులు కూడా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం.. ఆస్తుల కోసం వేధింపులు, దాడులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వృద్ధులను ఆదుకోవడానికి అనేక చట్టాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం(2007) ప్రకారం వృద్ధులకు నెలవారీ జీవన భృతి కల్పించాలన్నా రు.వారి పోషణను విస్మరించిన వారికిజరిమానా, జైలు శిక్ష తప్పవన్నారు. వృద్ధులకు ఏమైనా సమస్యలుంటే 15100 కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం వృద్ధులకు సంక్షేమశాఖ నుంచి వచ్చిన బెడ్‌షీట్లను అందించారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఐదు రోజులు వర్ష సూచన
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. జిల్లా మొత్తంగా సగటున ఈ నెల 8న 4 మి.మీ, 9న 12, 10న 15, 11న 13, 12న 15 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా మంగళవారం తెలిపారు. ఉష్ణోగ్రతలు 31.8 డిగ్రీల నుంచి 32.6 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఈశాన్యం దిశగా గాలులు గంటకు 9–10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
పీహెచ్‌సీల వైపు చూడని వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు మెడికల్ ఆఫీసర్లు విధులు బహిష్కరించి వారం రోజులుగా సమ్మె చేస్తుండగా వారి స్థానంలో సర్దుబాటు చేసిన వైద్యులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వివిధ వ్యాధులతో చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులు వైద్యులు లేరని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. సోమవారం మొత్తం 35 మందిలో 15 మంది మాత్రమే విధులకు హాజరుకాగా, మంగళవారం కేవలం ఇద్దరు రెగ్యులర్ వారితో పాటు 9 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. ఇందులో ఉలిందకొండ, కోసిగి, గజ్జిహల్లి, గార్గేయపురం, కౌతాళం, కల్లూరు, హాలహర్వి–ఎ, గూడూరు, పగిడిరాయి, పెద్దకడుబూరు, పెద్దహరివాణం పీహెచ్‌సీలు ఉన్నాయి. వైద్యులు లేకపోవడంతో రోగులకు అక్కడున్న ఫార్మాసిస్టులు, నర్సులు వ్యాధి లక్షణాల మేరకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మరోవైపు సంచార చికిత్స వాహనాలు సైతం వారం రోజులకు పైగా కదలడం లేదు. దీంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న రోగులు వైద్యపరీక్షలు, మందు లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

మతోన్మాదులను కట్టడిచేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం