సంప్రదాయ సమరానికి ‘సై’ | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ సమరానికి ‘సై’

Oct 2 2025 8:36 AM | Updated on Oct 2 2025 8:36 AM

సంప్ర

సంప్రదాయ సమరానికి ‘సై’

దేవరగట్టులో విజయదశమి రోజున మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం

కలాణోత్సవంతో మొదలుకానున్న ‘జైత్రయాత్ర’

వెయ్యి మందితో పోలీసు బందోబస్తు

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

దేవరగట్టు

హొళగుంద మండలం నెరణికి గ్రామ సమీపంలోని దేవరగట్టుపై వెలసిన మాత మాళమ్మ, మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవాలు విజయదశమి రోజున వైభవంగా జరుగుతాయి. అదే రోజు అర్ధరాత్రి నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణం తర్వాత జరిగే బన్ని ఉత్సవంలో ఘర్షణలకు తావులేకుండా కలిసి కట్టుగా జరుపుకుందామని దేవరగట్టు సమీపంలోని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి పాలబాసలు తీసుకుంటారు. అనంతరం కల్యాణానికి వస్తున్నట్లు గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. జౌట్‌లు పేల్చీ ఇనుప తొడుగులు, రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో నిమిషాల్లో కొండ(గిరి)పైకి చేరుకుంటారు. అక్కడ మాత మాళమ్మ, మల్లేశ్వర ఉత్సవ విగ్రహాలకు పురోహితులు, వేదపండితులు కల్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఉత్సవ మూర్తులతో జెత్రయాత్ర ప్రారంభమవుతుంది. నిట్రవట్టి, బిలేహాల్‌, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిలో పాల్గొంటారు. ఈక్రమంలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి పలువురికి గాయాలవుతాయి. మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను మల్లప్ప గుడిలో కొద్ది సేపు కొలువుంచి తిరిగి ఉత్సవ విగ్రహాలను పల్లకీతో ఊరేగింపుగా జైత్రయాత్రను కొనసాగిస్తారు.

భవిష్యవాణిపై నమ్మకం

శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో ఆలయ పూజారి గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా మొగలాయిని నిలిపేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్‌... గోపరాక్‌ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది.

జంతువుల నుంచి రక్షణకే..

పురాతన కాలంలో దసరా బన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మాళ మల్లేశ్వస్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో విద్యుత్‌, రవాణా సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల భారీ నుంచి రక్షణ పొందేందుకు దివిటీటులు, మారణాయుధాలు చేత పట్టుకుని కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించేవారు. కొందరు వ్యక్తిగత కక్షలతో చీకట్లో జరిగే ఊరేగింపులో రింగుకర్రలు, దివిటీలు, మారణాయు ధాలతో తమ ప్రత్యర్థులపై దాడులు చేసి పగ తీర్చుకునేవారు. ఇది కాలక్రమంలో కర్రల సమరంగా ముద్ర పడిపోయింది.

హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు

ఉత్సవంలో గాయపడిన భక్తులకు దేవరగట్టులో భారీ ఎత్తున హెల్త్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, ఆర్థోపెడిక్‌ సర్జన్‌, జనరల్‌ సర్జన్‌తో పాటు 100 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించనున్నారు. వాటర్‌ ప్రూప్‌ టెంట్‌లో వందకు పైగా మంచాలు, మెడిసిన్‌, ఇతర అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచనున్నారు.

విజయ దశమి రోజున అర్ధరాత్రి సాగనున్న సంప్రదాయ సమరానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల జైత్రయాత్ర సందర్భంగా బన్ని ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమరాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలమూలల నుంచే గాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెయ్యి మందితో పోలీసు బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. – హొళగుంద

ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభకాంక్షలు. ప్రతి ఒక్కరూ దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పండుగను భక్తితో నిర్వహించుకుని, సంతోషంగా ఇంటికి చేరాలి. ఉత్స వాల్లో పాల్గొనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామస్తులు బన్ని ఉత్సవం సమరం కాదు సంప్రదాయ పండుగని సమాజానికి చాటి చెబుదాం.

– బుసినే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే

సంప్రదాయ సమరానికి ‘సై’ 1
1/3

సంప్రదాయ సమరానికి ‘సై’

సంప్రదాయ సమరానికి ‘సై’ 2
2/3

సంప్రదాయ సమరానికి ‘సై’

సంప్రదాయ సమరానికి ‘సై’ 3
3/3

సంప్రదాయ సమరానికి ‘సై’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement