
నిలిచిపోయిన రహదారి పనులు
● ఇబ్బందుల్లో 5 గ్రామాల ప్రజలు
బేతంచెర్ల: మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె గ్రామం వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ రహదారికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం వరకు రహదారి పనులు పూర్తి చేసింది. అంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె వరకు చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ నిలిపేశారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన శంకరాపురం బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు.