
● రైతు కష్టం జీవాలపాలు!
సి.బెళగల్: ఉల్లి రైతుల కష్టం అంతా ఇంతా కాదు. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉల్లి పంట.. చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో దిక్కుతోచక జీవాలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు ఇమ్మానియేలు ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. మరోవైపు కోతకు కూలీ, గ్రేడింగ్, రవాణా ఖర్చులతో మరింత అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆందోళన చెంది జీవాలకు వదిలేశాడు. తన రెక్కల కష్టం జీవాలకు మేతగా మారడం చూసి రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉల్లి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.