
బెడిసి కొట్టిన పాసింగ్ కుట్ర!
ఆదోని మార్కెట్ యార్డులో వ్యాపారుల కుట్రలు తారస్థాయికి చేరాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పాసింగ్ ప్రక్రియను కొద్దిరోజులుగా రద్దు చేయడంతో వారి కుట్రలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ధర తగ్గించి వేరుశనగలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు యత్నించగా రైతులు దిగుబడులను ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పాసింగ్ ప్రక్రియ లేనిదే కొనుగోళ్లు సాగవనే భ్రమ కల్పించేందుకు చేసిన వ్యాపారుల కుట్రలు బెడిసికొట్టాయి.
ఆదోని అర్బన్: వ్యాపారుల కుమ్మక్కుతో వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ ధర ఒక్కసారిగా పడిపోయింది. రెండు వారాల క్రితం పాసింగ్ ప్రక్రియపై గందరగోళం జరిగిన విషయం విధితమే. అయితే ఈనెల 4న వ్యాపారులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లతో సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారులకు పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజులపాటు పాసింగ్ లేకుండా వేరుశనగ దిగుబడులను పరిశీలించి తమకు గిట్టుబాటు ధర వేసుకునేలా టెండర్ వేయాలని ఈనెల 8న ఆదేశించారు. అదే రోజు నుంచి వ్యాపారులు పాసింగ్ లేకుండా టెండర్ వేస్తున్నారు. నిన్నటి వరకు క్వింటా రూ.7,300 నుంచి రూ.6,800 వరకు ధర పలికింది. ఇలానే వేస్తే పాసింగ్ రద్దు చేయడం కష్టతరమవుతుందని వ్యాపారులు భావించి గురువారం ఒక్కసారిగా రూ.2,500 తగ్గించారు. మంగళవారం రోజున 425 సంచుల దిగుబడులు మార్కెట్‌యార్డుకు రాగా.. గరిష్ట ధర రూ.7,240 పలికింది. బుధవారం 717 సంచులు రాగా రూ.6,800 గరిష్ట ధర నమోదైంది. గురువారం 974 సంచులు రాగా రూ.4,568 గరిష్ట ధర పలికింది.
నష్టపోతున్న రైతులు
పాసింగ్ లేకుండా యథావిధిగా దిగుబడులను కొనుగోలు చేస్తారనే ఆశతో రైతులు గురువారం తమ దిగుబడులను మార్కెట్‌కు తీసుకొచ్చారు. వ్యాపారులు ఒక్కసారిగా రూ.2,500 తగ్గించి కొనుగోలు చేయడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న ఎమ్మిగనూరు మార్కెట్‌లో రూ.7 వేలకు పైగా ధర పలికిందనే విషయం తెలుసుకున్న రైతులు.. తమ దిగుబడులను అంత తక్కువ ధరకు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. అమ్మకం కోసం కిందపోసిన దిగుబడులను మళ్లీ బస్తాలకు నింపుకుని నిట్టు వేసుకున్నారు. వ్యాపారులు తమకు ముందే చెప్పి ఉంటే తాము దిగుబడులను తీసుకొచ్చేవారం కాదని, ఇప్పుడు ఇంటి నుంచి యార్డుకు తెచ్చిన దిగుబడుల ఖర్చు, యార్డులో రాశి పోసి నింపి, నిట్టువేసిన ఖర్చు ఎవరిస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు ఇలాగే వ్యవహరిస్తే వేరుశనగకాయల దిగుబడుల మార్కెట్ యార్డును బంద్ చేస్తాం. దిగుబడులను పరిశీలించి ధర వేసుకోవాలే గానీ ఇలా రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవు. వారికి నోటీసులు కూడా సిద్ధం చేశాం. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. లేదంటే చర్యలు తప్పవు.
– గోవింద్, యార్డు సెక్రటరీ
వ్యాపారుల కుమ్మక్కుతో తగ్గిన ధర
నిన్నమొన్నటి వరకు క్వింటం
రూ.7,300 పలికిన వేరుశనగ
ఇలాగే కొనసాగితే పాసింగ్
ప్రక్రియ పునరద్ధరించరేమోనని
వ్యాపారుల భయం
ధర తగ్గించి క్వింటం రూ.4,568
కొనుగోలు చేసిన వ్యాపారులు
అంత తక్కువ ధరకు ఇచ్చేది లేదంటూ
నిరాకరించిన అన్నదాతలు

బెడిసి కొట్టిన పాసింగ్ కుట్ర!