
రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలను పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఈఈ మురహరిరెడ్డి కోరారు. గురువారం ఆయన జిల్లాలో నాబార్డు నిధులతో చేపడుతున్న పలు రోడ్లను తనిఖీ చేశారు. వెల్దుర్తి–కోడుమూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడు వరకు రూ.1.50 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులతో పాటు వెల్దురి – కోటకొండ రోడ్డు నుంచి క్రిష్ణగిరి మండలం తొగర్చేడు గ్రామం వరకు రూ.1.20 కోట్లతో చేపడుతున్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతకు అధిక ప్రాధాన్యతను ఇస్తే పదికాలాల పాటు రోడ్లు మన్నికగా ఉంటాయన్నారు. ఇంజనీర్లు రోడ్ల పనులను తరచూ తనిఖీ చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఈఈ వెంట పీఆర్ క్వాలిటీ కంట్రోల్ కర్నూలు డీఈఈ ధనిబాబు, పీఆర్ పత్తికొండ డీఈఈ శేషయ్య తదితరులు ఉన్నారు.