
యూనివర్సల్ ఆధార్ క్లయింట్‌పై అవగాహన పెరగాలి
కర్నూలు(అర్బన్): ఆధార్ నమోదు, ఇతర సేవలకు సంబంధించి నూతనంగా ప్రవేశ పెట్టిన యూనివర్సల్ ఆధార్ క్లయింట్ సాఫ్ట్‌వేర్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి జి.నాసరరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్స్/ ఆధార్ ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ నూతన సాఫ్ట్‌వేర్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ఆధార్ సేవలను సకాలంలో పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేయాలని కోరారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. యుఐడీఏఐ మాస్టర్ ట్రైనర్ ఎస్ వెంకటరమణ మాట్లాడుతూ నూతన సాఫ్ట్‌వేర్ యూనివర్సల్ ఆధార్ క్లయింట్ గురించి వివరించారు.
డిప్లమా కోర్సులకు
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ డిప్లమా కోర్సులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లమా కోర్సులైన డిప్లమా ఇన్ అనెస్తీషియా టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ, ఈసీజీ, క్యాథలాబ్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్, ఆఫ్తాల్మిక్, డార్క్‌రూమ్ అసిస్టెంట్ కోర్సులకు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు భర్తీ చేసిన దరఖాస్తులను కర్నూలు మెడికల్ కాలేజిలో రూ.100 చెల్లించి అందజేయాలన్నారు. అక్టోబర్ 10వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నేటి నుంచి మహిళలకు ప్రత్యేక వైద్యశిబిరాలు
కర్నూలు(హాస్పిటల్):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేది వరకు స్వస్త్ నారి సశక్తి అభియాన్(ఆరోగ్యవంతమైన మహిళ–శక్తివంతమైన కుటుంబం)లో భాగంగా మహిళలకు ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.శాంతికళ, స్టేట్ నోడల్ ఆఫీసర్లు డిప్యూటీ డైరెక్టర్ రామనాథమ్, ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ,పట్టణ ఆరోగ్య కేంద్రా లు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏరియా ఆసుపత్రు లు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. శిబిరాల్లో పరీక్షలతో పాటు వైద్య చికిత్సలు అందిస్తామన్నారు.
అంతంతమాత్రంగానే శనగ విత్తనాల కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్‌కు శనగ విత్తనాలను కూటమి ప్రభుత్వం అరకొరగానే కేటాయించింది. రబీలో శనగ ప్రధాన పంట. కర్నూ లు జిల్లాలో 70 వేల హెక్టార్లకుపైగా.. నంద్యాల జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాకు 46 వేలు, నంద్యాల జిల్లాకు 25 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. అయితే కూటమి ప్రభుత్వం తూతూమంత్రంగా కర్నూలు జిల్లాకు 23,897 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 12,564 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. 2024 రబీ సీజన్‌కు ప్రభుత్వం ఒక్క కర్నూలు జిల్లాకే 45,955 క్వింటాళ్లు కేటాయించింది. గత రబీలో కర్నూలు జిల్లాలో 30 వేల క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 20 వేల క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా గత ఏడాది ఎంత మేర పంపిణీ అయింది.. ఈ సారి డిమాండ్ ఎంత అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు కేటాయిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా అరకొరగా కేటాయించి చేతులు దులుపుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 4,715 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 449 క్వింటాళ్లు కేటాయించింది. నంద్యాల జిల్లాకు మినుములు 3,300 క్వింటాళ్లు కేటాయించింది. ఈ విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధం చేస్తోంది.

యూనివర్సల్ ఆధార్ క్లయింట్‌పై అవగాహన పెరగాలి