
‘వేదావతి’లో ఇసుకాసురులు!
● అధికారం మాటున
ఇసుక అక్రమ రవాణా
● పట్టించుకోని అధికారులు, పోలీసులు
ఆలూరు రూరల్: అనుమతి లేని తవ్వకాలతో అక్రమార్కులు వేదావతి నదిని తోడేస్తున్నారు. అధికారం మాటున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అయినా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. హొళగుంద మండలం పరిధిలోని మార్లమడికి గ్రామ సమీపంలోని వేదావతి నది నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. వాస్తవానికి వేదావతి నదిలోని ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను అనుమతి లేదు. సంబంధిత అధికారుల సహాయ సహాకారాలతో అక్రమార్కులు ఒక్క ట్రాక్టర్‌కు అనుమతి తీసుకుని రోజుకు పది ట్రాక్టర్ ఇసుక తరలిస్తూ సొమ్మ చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాలకు ఎలాంటి రాయితీ లేకుండా ఇసుక తరలించుకోవచ్చు. అయితే ఇసుక అవసరం ఉన్న వారు ట్రాక్టర్ ఇసుకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలు చెల్లించి తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అక్రమాలకు రైట్ రైట్!
కళ్లెదుట ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. తమకు నచ్చని వారి ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల నుంచి హొళగుంద మండలంలోని మార్లమడికి సమీపంలోని వేదావతి నది నుంచి పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా ప్రశ్నించేవారు కరువయ్యారు. కాసులకు కక్కుర్తి పడి హాలహర్వి, హొళగుంద మండలాల్లోని వేదావతి నది నుంచి టన్నుల కొద్ది ఇసుకను తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.