
అపూర్వం.. ఆపాత మధురం
నంద్యాల(న్యూటౌన్): ముడుతల ముఖం.. తెల్లగా నెరిసిన జట్టు.. ఊతకర్ర సహాయంతో నడుస్తూ కొందరు.. చూపు తగ్గి.. ఒంట్లో సత్తువ లేక అడుగుల్లో అడుగులు వేస్తూ మరి కొందరు.. ఒక చోట చేరి నాటి గురువులు చెప్పిన పాఠాలను.. స్నేహితుల అల్లరిని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాల జడివానలో తడిసి ముద్దయ్యారు. ఏడు పదుల వయస్సులో వారంతా దాదాపు 50 ఏళ్ల తర్వాత కలుసుకుని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1973–76 బీఎస్సీ డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఉద్యోగాలు, కుటుంబ పరంగా ఎంతో దూరంగా ఉన్న వీరంతా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని నాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ వివరాలు, తమ జీవితంలో ఎదురైన ఘటనలు, అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి అధ్యాపకులు రామచంద్రారెడ్డి, రామిరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొని పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒక చోట కూడి ఆప్యాయతలు, అనురాగాల మధ్య వేడుక చేసుకోవడం అభినందనీయమన్నారు. రిటైర్డు హెచ్‌ఎం చంద్రశేఖర్ ప్రార్థనా గీతంతో ప్రారంభించి చక్కటి పాటలు పాడారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విల్సన్‌తో గిటారు వాయించడం, నంద్యాల ప్రముఖ గాయకుడు ప్రభాకర్ చక్కటి పాటలతో అలరించారు. కార్యక్రమంలో రిటైర్డు డిప్యూటీ విద్యాశాఖ అధికారి బ్రహ్మానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అపూర్వం.. ఆపాత మధురం