
మద్యానికి బానిసై.. వ్యక్తి బలవన్మరణం
ఆదోని అర్బన్: పట్టణంలోని శుక్రవారం పేటకు చెందిన బోయ దుర్గప్ప(43) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే బోయ దుర్గప్పకు భార్య చిన్నలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. అయితే, ఈయన కొద్ది కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వారించినా మద్యం తాగడం మానని అతను ఉన్నట్టుండి ఆదివారం ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తండ్రి కౌలుట్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గని గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని ముళ్ల పొదలమధ్య ఉన్న గని గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. ఆదివారం కొందరు వ్యక్తులు నీటిలో తేలుతున్న మృత దేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని, సోమవారం ఉదయం బయటకు తీసి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
సైక్లింగ్‌తో ఆరోగ్యం
కర్నూలు(అగ్రికల్చర్): పోలీసులతో పాటు ప్రజలు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా, సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టింది. ఏఆర్ అడిషినల్ ఏస్పీ కృష్ణమోహన్ పచ్చ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత కంట్రోల్ రూము, కిడ్స్ వరల్డ్ మీదుగా రాజ్‌విహార్ వరకు వెళ్లి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, ఇందులో పోలీసులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చన్నారు. సైక్లింగ్, ఇతర వ్యాయామాల ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఆర్‌ఐ నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ పోలీసులు పాల్గొన్నారు.