
బాలింత మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
● ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు
ధ్వంసం చేసిన బాధితులు
గోస్పాడు: వైద్యులు నిర్లక్ష్య కారణంగానే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. మృతురాలి తండ్రి జమాల్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన షేక్షావలికి శిరివెళ్లకు చెందిన హబీబాతో ఏడాది క్రితం వివాహమైంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆమె నంద్యాల పట్టణంలోని నెరవాటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. శనివారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఈ సమయంలోనే బాలింతకు ఫిట్స్ వచ్చాయని, రక్తం అవసరమని వెంటనే పట్టణంలోని మరో ప్రైవేటు ఆసుపత్రి ఎన్‌ఐటీసీకి తరలించారు. అక్కడ వెళ్లిన కొద్ది గంటల్లోనే హబీబా చనిపోయినట్లు చెప్పారు. రక్తం తక్కువగా ఉందని మొదట్లో చెప్పకపోగా.. రెగ్యులర్‌గా చూసే పెద్ద డాక్టర్ కాకుండా ఇతరులతో ఆపరేషన్ చేయించారని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ నెరవాటి ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో రాళ్లతో ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. బాలింత మృతిపై నెరవాటి ఆసుపత్రి అధినేత డాక్టర్ వినోద్‌కుమార్ వివరణ కోరగా సర్జరీ సమయంలో ఫిట్స్ రావడంతో ఆమె కోలుకోలేక మృతిచెందిందని వెల్లడించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్ బాషా తెలిపారు.