
కుందూలో దూకిన వృద్ధురాలు
అనారోగ్య కారణాలతో ఆత్మహత్యాయత్నం ఆచూకీ కోసం నది వెంబడి
ఉయ్యాలవాడ: మండల కేంద్రం ఉయ్యాలవాడకు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్య కారణాలతో కుందూనదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఆమె ఆచూకీ గల్లంతైంది. గ్రామానికి చెందిన పూల ఫకూర్‌బీ(80) అలియాస్ గుత్తి ఫకూర్‌బీ అనే వృద్ధురాలి భర్త దాదాపు 30 ఏళ్ల క్రితం క్రితం మృతి చెందాడు. కుమారుడు కూడా గత 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కోడలు, ముగ్గురు మనవళ్లు వుండగా వారి వద్దనే జీవనం కొనసాగించేది. కాగా కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ వుండేది. శనివారం ఉదయం 7 గంటల సమ యంలో ఇంటి నుంచి రూపనగుడి గ్రామం వైపు వెళ్తుండగా కుందూనది వంతెన వద్ద గంగ పుత్రులు అంబటి రమణయ్య, గగ్గెర తిక్కయ్యలు.. వృద్ధురాలిని ఎక్కడికి వెళ్తున్నావని పలకరించారు. రూపనగుడిలో తమ బంధువులను చూసేందుకు వెళ్తున్నానని బదులు ఇస్తూ ముందుకు వెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే నీళ్లలో ఏదో పడిన శబ్దం రావడంతో గంగపుత్రు లు వెనుదిరిగి చూశారు. వంతెనపై వెళ్తూ వృద్ధురాలు కుందూలోకి దూకి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతూ గల్లంతు కావడం వారు చూశారు. విషయం వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రసాద్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గల్లంతైన వృద్ధురాలి ఆచూకీ కోసం మండలంలోని కుందూ వెంట వున్న గ్రామాల వీఆర్‌ఓలు గాలింపు చర్యలు చేపట్టాల ని ఆదేశించామన్నారు. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం తహసీల్దార్, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. నది ఉద్ధృతి తగ్గేంత వరకు ప్రజలను అప్రమత్తం చేయాలని వీఆర్‌ఓలు లక్ష్మీనారాయణరెడ్డి, దాదా సాహెబ్, వెంకటలక్ష్మి, చెన్నప్పను ఆదేశించారు.
గాలింపు చర్యలు