
ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
కర్నూలు సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయు ల బకాయిలు చెల్లించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కరుణానిధిమూర్తి డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్‌లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.వి కృష్ణారెడ్డి అద్యక్షతన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరుణానిధిమూర్తి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విధులు నిర్వహించారని, ఇప్పటి వరకు బకాయిలను చెల్లించలేదన్నారు. వెంటనే మద్యంతర భృతిని ప్రకటించి, 12వ పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, ధనుంజయలు మాట్లాడుతూ.. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని దసరా సెలవుల తరువాత నిర్వహించాలన్నారు. దసరా సెలవులను ఈ నెల 22 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ప్రకటించాలన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులను, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిని, ఈ నెల 5వ తేదిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని సన్మానించారు. ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు కెవి రమణయ్య, జిల్లా గౌరవ అద్యక్షులు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.