
జల్సాలకు అలవాటు పడి..
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన అంతర్‌రాష్ట్ర దొంగ
రూ.16 లక్షలు విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు రికవరీ
సీసీ ఫుటేజీ ద్వారా ఛేదించిన పోలీసులు
కర్నూలు : మద్యం, జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాల చోరీని ఎంచుకున్నాడు. కర్నూలు నగరంలో భారీగా ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. రెండు మాసాలుగా సాగుతున్న అంతర్‌రాష్ట్ర దొంగ చోరీల పర్వానికి రెండో పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి అతని నుంచి రూ.16 లక్షలు విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. రెండో పట్టణ సీఐ నాగరాజరా వు, ఎస్‌ఐలు సతీష్, మల్లికార్జునలతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ బాబుప్రసాద్ శుక్రవారం వి లేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్...
తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణం దౌడురాళ్ల కాలనీకి చెందిన తెలుగు జయంత్ అలియాస్ జశ్వంత్ కర్నూలు సుంకేసుల రోడ్డులోని రెండు వాగుల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేరాల చిట్టా బయటపడింది. అతని వద్ద నుంచి 32 బైకులను పోలీసులు రికవరీ చేశారు.
సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదన..
కర్నూలు నగరంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర పార్కు చేసి ఉంచిన బైక్ చోరీకి గురైందని లక్ష్మీనగర్‌కు చెందిన నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా బైకులు చోరీకి గురైనట్లు వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో నగరంలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. వీటి ఆధారంగా దొంగను పట్టుకున్నారు చోరీ చేసిన బైకులను జయంత్ తన సొంత ఊరులోని రహస్య ప్రదేశంలో దాచి ఉంచి ఖర్చులకు డబ్బులు అవసరమైనప్పుడల్లా వాటిని రూ.5 వేలు, రూ.10 వేలకు విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు. కర్నూలులోని ముఖ్య కూడళ్లు, హోటళ్లు, ఇళ్ల దగ్గర పార్కు చేసిన బైకులను ఇతను దొంగలించినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. గతంలో హైదరాబాదు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా బైకులు చోరీ చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ నేరాల బాట పట్టాడు. రికవరీ చేసిన బైకులను ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన బైకు దొంగతనాల కేసుల ఆధారంగా బాధితులకు అప్పగిస్తామని డీఎస్పీ వెల్లడించారు. భారీ మొత్తంలో చోరీకి గురైన బైకులను రికవరీ చేసి మోస్ట్ వాంటెడ్ బైక్ దొంగను అరెస్టు చేసినందుకు క్రైం పార్టీ పోలీసులను, దర్యాప్తు అధికారులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

జల్సాలకు అలవాటు పడి..