
ఆర్టీసీ బస్సు తగిలి యువకుడి మృతి
హొళగుంద: ఆర్టీసీ బస్సు తగిలి ఓ యువకుడు మృతి చెందగా..మరొకరు గాయపడ్డారు. శుక్రవారం హొళగుంద సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామానికి చెందిన రంగస్వామి, మంగమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత కుమారుడు బోయ రంజిత్‌త్ కుమార్ (18) జన్మించాడు. ఈ యువకుడు హొళగుందలోని ఓ ఫోటో స్టుడియోలో పని చేస్తున్నాడు. శుక్రవారం స్వగ్రామం నుంచి హొళగుందకు వచేందుకు పెద్దహ్యాట క్రాస్ వద్ద సుళువాయి గ్రామానికి చెందిన చిన్న ద్యావన్న అనే వ్యక్తి బైక్ ఎక్కాడు. సుళువాయి రోడ్డు శబరి ఆశ్రమం స్థలం వద్ద ఆలూరు నుంచి హొళగుందకు వస్తున్న ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ21జెడ్0341) వారి బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తుండగా బస్సు వెనుక భాగం బైక్‌ను తగలడంతో ఇద్దరు ఆదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రంజిత్‌కుమార్ ముఖానికి గాయమై నోటిలోనే పళ్లన్ని ఊడి తీవ్ర రక్తస్రావం కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రంజిత్‌ను హొళగుంద హీహెచ్‌సీకి తరలించగ అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి వెళ్లాలన్నారు. అయితే, ఆ సమయంలో108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు కారులో తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించలోగా ఆ యువకుడు ప్రాణాలొదిలాడు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్ డ్రైవర్ హనుమంతు బస్సుతో పాటు హొళగుంద పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దహ్యాట గ్రామస్తులు, మృతుడి బంధువులు స్టేషన్‌కు చేరుకొని ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండి పడ్డారు. మృతుడి తండ్రి రంగస్వామి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రామ్‌నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో మరణించడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.