
పథకం ప్రకారమే మద్యం తాపించి హత్య
● స్నేహితుడి గొంతు కోసి చంపిన కేసులో నిందితుడి అరెస్ట్
కోడుమూరు రూరల్: మద్యం మత్తులో తోటి స్నేహితుడిని గొంతు కోసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపిన మేరకు వివరాలు... కోడుమూరు మండలం వెంకటగిరికి చెందిన హతుడు బోయ గిరి(26), దూదేకుల మౌలాలి అనే వ్యక్తులు ప్రాణ స్నేహితులు. ఇద్దరు కర్నూలులో ఒకే రూమ్‌లో ఉంటూ జేసీబీ డ్రైవర్లుగా పనిచేసేవారు. అయితే దూదేకుల మౌలాలికి సొంత అన్న మధ్య హతుడు బోయ గిరి తరచూ గొడవలు పెట్టడంతో పాటు అతని తల్లిని దూషిస్తూ మాట్లాడేవాడు. దీన్ని మనసులో ఉంచుకున్న మౌలాలి ఓ పథకం ప్రకారం ఈనెల 6న గిరిని కోడుమూరులోని మద్యం దుకాణానికి తీసుకొచ్చి పూటుగా మద్యం తాపాడు. అనంతరం ప్లాన్ ప్రకారం మౌలాని వెంట తెచ్చుకున్న కత్తితో గిరి గొంతుకోసి హత్య చేశాడు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి, ట్రైనీ ఎస్‌ఐ మణికంఠ, సిబ్బందిని ఈ సందర్భంగా సీఐ ప్రత్యేకంగా అభినందించారు.