
మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఈ–సేవా కేంద్రం
కర్నూలు: ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఈ–సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి శుక్రవారం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని కోర్టులకు సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులకు ఈ–సేవా కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటుందన్నారు. కక్షిదారులకు ఈ–కోర్టు సేవలు, సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల తీర్పు కాపీలు, న్యాయపరమైన ఆదేశాలు, తీర్పు కాపీలను ఇక్కడ పొందవచ్చని జిల్లా జడ్జి తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు, న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
దసరా బిగ్‌సేల్ ఆఫర్ల పేరిట మోసాలు
● అప్రమత్తంగా ఉండాలని
జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి
కర్నూలు: సోషల్ మీడియాలో ఆకట్టుకునేలా ఫెస్టివల్ ఆఫర్స్, బిగ్ సేల్ అంటూ లింకులు పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధర కదా అని ఆశ పడి వెంటనే లింకులు ఓపెన్ చేసి మోసపోవద్దని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకు ఆన్‌లైన్‌లో వస్తువులు ఇస్తామంటే వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. సోషల్ మీడియాలో లింకుల ద్వారా వచ్చే యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోవద్దన్నారు. ఇలాంటి మోసాలపై వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఈ–సేవా కేంద్రం