
పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ అర్హుల వివరాలను పంపండి
కర్నూలు(అర్బన్): తమ కళాశాలల్లో పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, వికలాంగ విద్యార్థుల వివరాలను వెంటనే పంపించాలని సాంఘీక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. శుక్రవారం ఉదయం ఆమె తన చాంబర్ నుంచి ఆయా కళాశాలలు, విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్స్‌తో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం కళాశాలల్లో జ్ఞానభూమి వీ2 లాగిన్‌లో ఇంకా 5,169 మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్, 5995 మంది విద్యార్థుల బయోమెట్రిక్ ఆధార్ నిర్ధారణ, 2891 మంది విద్యార్థులకు సంబంధించి ప్రిన్సిపాల్స్ ఓటీఏ వివరాలు అందాల్సి ఉందన్నారు. అలాగే 12,945 మంది విద్యార్థుల ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్‌కు బయోమెట్రిక్ అథెంటికేషన్, ప్రిన్సిపాల్స్ ఓటీఏ పూర్తి చేయాలన్నారు. ప్రిన్సిపాల్స్ అందరూ ఈ ప్రక్రియను ఈ నెల 15వ తేదిలోగా పూర్తి చేయాలని ఆమె కోరారు. అలాగే దరఖాస్తు చేసిన విద్యార్థులు గ్రామ/వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుల లాగిన్ ద్వారా తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఎస్‌సీ విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను తప్పనిసరిగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు.