
ఫిజియోథెరపీ...అంతా హ్యాపీ!
డాక్టర్ ఆపరేషన్ చేసినా...ఆ తర్వాత మళ్లీ సాధారణ జీవితం గడపాలంటే మాత్రం ఫిజియోథెరపీ కొంత కాలం చేయించుకోకతప్పదు. పలు రకాల రుగ్మతలు, నొప్పులు, ఇబ్బందుల నుంచి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని జబ్బులకు ఫిజియోథెరపీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పరికరాలతో చికిత్స చేయించుకోవాల్సి రాగా, మరికొన్ని అక్కడి వైద్యుల సలహాతో ఇంటి వద్దే వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చెప్పిన ప్రకారం ప్రతిరోజూ ఆచరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రస్తుతం 1200 మందికి పైగా ఫిజియోథెరపిస్ట్‌లు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ ఉచితంగా ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి అవసరమైన పరికరాలను గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సమకూర్చడంతో దాదాపుగా అన్ని సమస్యలకు ఇక్కడ చికిత్స లభిస్తోంది. ఇక్కడికి ఆర్థోపెడిక్, న్యూరాలజి, న్యూరోసర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, కార్డియాలజి తదితర విభాగాల నుంచి రోగులు ఫిజియోథెరపీ చికిత్స కోసం వస్తుంటారు. ఈ కేంద్రానికి రాలేని, బెడ్‌పైనే ఉన్న రోగులకు మాత్రమే ఫిజియోథెరపిస్టులే వెళ్లి చికిత్స అందిస్తుంటారు. ఇందులో టెన్స్, ఇంటర్ ఫెరిన్షియల్ థెరపి, అల్ట్రాసోనిక్ థెరపి, ఎలక్ట్రికల్ స్టిమిలేటర్, షార్ట్‌రేవ్ డయాటర్మి, సీపీఎం డివైస్, లేజర్, ట్రెడ్‌మిల్, బైసైకిల్ అర్బోమీటర్, క్వార్ర్‌డిసెట్స్ టేబుల్, పారలల్ బార్, షోల్డర్ వీల్, స్విస్ బాల్స్‌తో పాటు పలు వ్యాయామ పరికరాలున్నాయి. కర్నూలుతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో, ఆదోని ఏరియా ఆసుపత్రిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఫిజియోథెరపిస్టులు రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు.
ఫిజియోథెరపీతో అందే వైద్యం
ఫిజియోథెరపీ చికిత్సలో భాగంగా 8 అంకైపె నడవడం, రెండు సరళ రేఖల మధ్య నడిపించి చికిత్స చేస్తారు. దీనివల్ల కీళ్లు బిగుతుగా మారకుండా కదలిక య థావిధిగా ఉండేలా కండరాలు బిగుతుగా మారకుండా, క్షీణించకుండా, రక్తప్రసరణ యథావిధిగా జరిగేలా ఉంటాయి. మంచంపై ఒకే స్థితిలో పడు కోకుండా అత్యధిక ఒత్తిడి కలిగిన ప్రాంతాలపై పుండ్లు/అల్సర్‌లు పెరగకుండా ఉండేందుకు పొజిషన్ చేంజింగ్, బెడ్ రోలింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తారు. ఇవే గాక వెయిట్ బేరింగ్ ఎక్సర్‌సైజ్‌లు, న్యూరో డెవలప్‌మెంట్ ట్రైనింగ్, కో ఆర్డినేషన్ ఎక్సర్‌సైజ్‌లు, చేతి కి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లను ఫిజియోథెరపిస్ట్‌లు అందిస్తున్నారు.
శరీర కదలికలు సాధారణ స్థితికి
ఏదైనా కారణం, ప్రమాదం వల్ల గాయం, వైకల్యం ఏర్పడితే శరీర భాగాల కదలిక ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి శరీర భాగాల కదలికను సాధారణస్థితికి తెచ్చేందుకు ఫిజియోథెరపీ వైద్యం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, మెడనొప్పి, నడుమునొప్పి, మోకాళ్లనొప్పి, భుజంనొప్పి, వెన్ను సమస్యలు శస్త్రచికిత్సకు ముందు తర్వాత వాటి పనితీరును పునరుద్ధరించడానికి రిహాబిలిటేషన్ ఉపయోగపడుతుంది. నరాల బలహీనతలు, పనిచేసే చోట వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదపడుతుంది.
నొప్పుల నుంచి ఉపశమనం
పలు వ్యాధులకు మెరుగైన వైద్యం
ప్రభుత్వాసుపత్రుల్లో
ఉచిత థెరపీ చికిత్స
ప్రైవేటులో పెరిగిన వైద్యులు
నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే
నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం
ఫిజియోథెరపి వైద్యం ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ఫ్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇటీవల కాలంలో యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్లు వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫిజియోథెరపీ వైద్యం ద్వారా ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగిస్తున్నారు. గర్భిణులు తెలిసి తెలియకుండా వాడే కొన్ని మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే పిల్లలు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే దానిపై ఫిజియోథెరపిస్ట్ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఫిజియోథెరపీ ద్వారా తల్లి కడుపులో పెరిగే బిడ్డతో మొదలు వయోవృద్ధుల వరకు ఎన్నో జబ్బులను తగ్గించవచ్చు.

ఫిజియోథెరపీ...అంతా హ్యాపీ!