
ఉల్లి ధర మరింత పతనం
క్వింటాలుకు రూ.172 ధర లభించింది
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర మరింత పతనం అయ్యింది. రైతులు కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 5వ తేదీ రాత్రి కర్నూలు మార్కెట్‌కు 16,589 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. 6వ తేదీన అమ్మకానికి పెట్టారు. ఇందులో వ్యాపారులు 7,756 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిపోయిన ఉల్లి 8,842 క్వింటాళ్లను ఆదివారం అమ్మకానికి పెట్టగా గతంలో ఎపుడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కిలో ఉల్లికి రూపాయి ధర లభించడంతో రైతులు కన్నీళ్లతో ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు కనిష్టంగా 30 క్వింటాళ్లు, గరిష్టంగా 80 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. క్వింటాలుకు రూ.100 ధర లభిస్తుండటంతో రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. వ్యాపారులు ఈ నామ్ ద్వారా 7,263 క్వింటాళ్లు కొన్నారు. కనిష్ట ధర రూ.100, గరిష్ట ధర రూ.619 మాత్రమే. ఉల్లిలో నాణ్యత బాగుంది. రెండు, మూడు రోజులుగా వర్షాలు లేవు. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ క్వింటాలు ఉల్లికి రూ.100 ధర ఇవ్వడం కర్నూలు మార్కెట్ యార్డులో కలకలం రేపింది. 1,579 క్వింటాళ్ల ఉల్లిని వ్యాపారులు కొనకుండా చేతులెత్తేశారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్‌ఫెడ్ రూ.1,200 ధరతో కొనుగోలు చేసింది.
రైతు ఆత్మహత్యాయత్నాలను
బోగస్ అంటారా?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయాయి. పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన రైతులు వెంకటనాయుడు, కృష్ణ ఉల్లి సాగు చేసిన నష్టాలు మూట కట్టుకున్నారు. అప్పల బాధలను తట్టుకోలేక పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని సాక్షాత్తూ ప్రభుత్వమే బోగస్‌గా పేర్కొనడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. బయట కిలో ఉల్లి రూ.20–25 ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులో మాత్రం రైతులు తెచ్చిన ఉల్లి కిలో రూపాయి ప్రకారం కొంటున్నారు. ఇంత అధ్వాన్నంగా ధరలు లభిస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మూన్నాళ్ల ముచ్చట
రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు చేస్తామని ప్రభుత్వం చేసిన హడావుడి మూడు రోజులకే ముగిసింది. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రో జులు మార్కెట్‌కు ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి. ఈ రోజుల్లో వచ్చిన ఉల్లి మొత్తాన్ని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఈ నెల 6న మార్కెట్‌కు ఉల్లిగడ్డలు పోటెత్తడ ంతో కొనుగోలులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో మద్దతు కొనుగోలు మూన్నాళ్ల ముచ్చటగా మారింది.
రైతులతో మాట్లాడిన జిల్లా అధికారులు
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నవ్య పర్యటించారు. ఉల్లి రైతులతో మాట్లాడారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి అమ్ముకున్న ప్రతి రైతుకు మద్దతు ధర రూ.1200 లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యాపారులు కొనిన ధరను మినహాయించి మిగిలిన ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు చెప్పారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఉల్లికి లభించిన ధరరకు సంబంధించి మార్కెట్ కమిటీ రసీదు కూడా ఇస్తుందని పేర్కొన్నారు.
బారులు తీరిన ఉల్లి ట్రాక్టర్లు
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లి బయటికి పోవడం లేదు. వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేయడంలోను, కొన్నదానిని బయటికి తరలించడంలోను అంతులేని జాప్యం చేస్తున్నారు. అన్ని షెడ్లలోను ఉల్లి నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. సోమవారం మార్కెట్‌లో ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టేందుకు ఆదివారం మధ్యాహ్నం నుంచి రావడం మొదలైంది. లోపల ఉన్న ఉల్లి బయటికి పోకపోవడంతో వచ్చిన లారీలను బయటనే నిలబెట్టారు. కర్నూలు అశోక్‌నగర్ నుంచి కొత్తబస్టాండ్, విద్యుత్ భవన్ వరకు ఉల్లి ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కిలోకు లభించిన ధర
ఒక్క రూపాయి మాత్రమే!
కన్నీరు మున్నీరవుతున్న రైతులు
పెట్టుబడి ఎకరాకు రూ.లక్ష పైనే
దక్కుతున్నది రూ.10 వేలు మాత్రమే
ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నాలను
బోగస్ అనడంపై నిరసన
ఈ చిత్రంలోని రైతుపేరు గురురాజగౌడు. సి. బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఈయన మూడున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష ప్రకారం పెట్టుబడి పెట్టారు. ఈ నెల 5వ తేదీ రాత్రి అమ్మకానికి 350 ప్యాకెట్ల ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తెచ్చారు. దీనిని రెండు లాట్లగా అమ్మకానికి పెట్టారు. 200 ప్యాకెట్లు ఉన్న లాట్‌కు లభించిన ధర రూ.172 మాత్రమే. కిలోకు లభించిన ధర రూ.1.71 మాత్రమే. ధర ఇంత అధ్వానంగా లభిస్తే పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కలేదని రైతు ఆందోళన చెందుతున్నారు.

ఉల్లి ధర మరింత పతనం