
పల్లె ‘పోరు’కు సన్నాహాలు
● తాత్కాలిక షెడ్యూల్‌ను
ప్రతిపాదించిన ఎస్‌ఈసీ
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 3న తాత్కాలిక షెడ్యూల్‌ను జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పాలన 2021 ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం 2026 ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ముందస్తుగానే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు తాత్కాలిక షెడ్యూల్‌లో ఏ తేదిల్లోగా ఎలాంటి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది? ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు? జనాభా, సామాజిక వర్గాల వివరాలను సేకరించడం తదితర పనులు ప్రారంభమయ్యాయి.
తాత్కాలిక షెడ్యూల్‌లో సూచించిన మేరకు..
● ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నాటికి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలుగా అప్‌గ్రేడేషన్ అయ్యే గ్రామ పంచాయతీల వివరాలు, సమీపంలోని మున్సిపాలిటీల్లోకి విలీనం అయ్యే వాటిని పూర్తి చేసుకోవాలి.
● అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచురించిన ఎలక్ట్రోల్స్ ప్రకారం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఎలక్ట్రోల్స్‌ను రూపొందించుకోవాలి.
● నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాల తుది ప్రచురణ పూర్తి కావాలి. అలాగే బ్యాలెట్ బాక్సుల రిపేర్లతో పాటు ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదనలు వస్తే ఈవీఎంలను మొదటి దశలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
● డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
● డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలి.
● 2026 జనవరిలో ఎన్నికలను నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది.