
ఉల్లి.. కుళ్లి‘పాయె’!
● వర్షాలకు దెబ్బతిన్న ఉల్లి పంట ● కోత కోసి ఆరబెట్టిన దక్కని ప్రయోజనం
● మార్కెట్‌లో ధర లేక పొలంలోనే వదిలేస్తున్న రైతులు
సి.బెళగల్: ఖరీఫ్‌లో ఉల్లి సాగు చేసిన రైతులు కన్నీరు పెడుతున్నారు. చేతికొచ్చిన దిగుబడిని కాపాడుకోలేక, మార్కెట్‌లో విక్రయించలేక నష్టాలు మూటగట్టుకుంటున్నారు. తుంగభద్ర నదితీర గ్రామాలైన తిమ్మందొడ్డి, సంగాల, గుండ్రేవుల, కొండాపురం, పల్‌దొడ్డి, ముడుమాల గ్రామాల్లో రైతులు అత్యధికంగా ఉల్లి సాగు చేశా రు. అదేవిధంగా బోర్లు, బావులు, ఎత్తిపోతల పథకం నీటి వనరుల ద్వారా పోలకల్, మారందొడ్డి, బురాన్‌దొడ్డి, బ్రాహ్మణదొడ్డి, సి.బెళగల్, కంబదహాల్ గ్రామాల్లో సైతం ఉల్లి పంటలను రైతులు సాగు చేశారు. మొత్తం మండల వ్యాప్తంగా 2,630 ఎకరాల్లో సాగు చేశారు. కాగా పంట చేతికి దిగుబడులు వచ్చేసరికి మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించకపోవడం, అధిక వర్షాలతో రైతులు నష్టాలపాలయ్యారు. ప్రస్తుతం ఉల్లి పంట కోతలు పూర్తికావడంతో దిగుబడి నిల్వలను రైతులు పొలాలు, కల్లాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసుకున్నారు. కనీసం రవాణా చార్జీలు వచ్చే పరిస్థితి లేకపోవడం, కొన్నాళ్ల పాటు నిల్వ చేసుకునే ఏర్పాట్లు ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో దిగుబడులను ఎక్కడ పడితే వదిలేస్తున్నారు. దీంతో ఉల్లిగడ్డలు కుళ్లిపోయి గ్రామాల్లో దుర్వాసన వస్తోంది. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఉల్లి.. కుళ్లి‘పాయె’!

ఉల్లి.. కుళ్లి‘పాయె’!