
రామ్‌కోలో కార్మికుడి మృతి
కొలిమిగుండ్ల: కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీలో జీవనోపాధి కోసం పని చేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు శనివారం ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా లొడ్డపుట్టి గ్రామానికి చెందిన దోలుపద్ర దాల్చిని (49) రామ్‌కోలో రాజవర్దన్ కాంట్రాక్టర్ కింద పనులు చేసేందుకు వచ్చాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన అతను పని చేసే సమయంలో అకస్మాతుగా కింద పడిపోవడంతో తలకు గాయమైంది. తోటి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం తాడిపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింంచగా ఆదివారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.
108 సిబ్బంది నిజాయితీ
ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో గాడపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా ఆయన దగ్గరున్న డబ్బులను బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఆస్పరి 108 సిబ్బంది. అట్టెకల్లు గ్రామానికి చెందిన హరికృష్ణ శుక్రవారం పనిమీద ఆస్పరికి వచ్చి రాత్రి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. అట్టెకల్లు సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కింద పడ్డాడు. ఈ ఘటనలో హరికృష్ణకు రక్తగాయాలయ్యాయి. సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న 108 పైలెట్ వీరస్వామి, ఈఎంటీ వీరేష్ క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేసి ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి వద్దనున్న రూ.1.68 లక్షలను అతని తమ్ముడు ధనుంజయను పిలిపించి ఆసుపత్రిలోనే పైలెట్, ఈఎంటీ అప్పగించారు. దీంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు.
బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలల నుంచి కేంద్ర ప్రభుత్వ జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ శనివారం ఒక ప్రకటనలో కోరారు. సామాజిక సేవ, సంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర వాటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తి, అర్హత కలిగిన వారు https://awards. gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుందన్నారు.
గృహ హింసపై
అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు ...
గృహ హింస చట్టంపై కొన్ని స్వచ్చంధ సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఐసీడీఎస్ పీడీ విజయ కోరారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని స్వచ్చంధ సంస్థలు గృహ హింస చట్టం 2025 అమలుకు సంబంధించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, మహిళలకు రక్షణ కల్పించే గృహ హింస చట్టం అమలు బాధ్యత పూర్తిగా మహిళా శిశు సంక్షేమ శాఖకు మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు.