
సీమకు బాబు ద్రోహం
ఆదోని రూరల్: రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి మాటలు చెబుతూ ద్రోహం చేస్తున్నారని రాయలసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా రశరథరామిరెడ్డి విమర్శించారు. పదవులు కావాలి కానీ రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఆదోని పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో కర్నూలు జిల్లా జలసాధన సమితి సదస్సు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాయలసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి హాజరై మాట్లాడారు. రాయలసీమలో వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు, చిన్నచిన్న ఆనకట్టలు నిర్మించాలన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని వేదావతి ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నారు. పందికోన రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. ఆస్పరి మండలానికి హంద్రీ–నీవా నుంచి తాగునీరు అందించాలన్నారు. నగరడోణ రిజర్వాయర్ పనులు మొదలు పెట్టాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా జల సాధన సమితి కన్వీనర్ శేషాద్రిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు హలిగేర కేశం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, వేదావతి ప్రాజెక్టు కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, సుజ్ఞానమ్మ, మనీ, శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.