
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు స్పర్శ దర్శనం పొందారు.
ఈ నీళ్లు తాగేదెట్టా?
హొళగుంద: రంగుమారిన నీటిని ఎలా తాగాలని హెబ్టటం ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కి నీటిని విడుదల చేయగా ఆ నీటినే హెబ్బటం మంచినీటి పథకం నుంచి గ్రామాలకు వదులుతున్నారు. ఫిల్టర్ చేయకుండా నేరుగా కుళాయిలకు వదులుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని తాగితే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని, తప్పని పరిస్థితిలో మినరల్ వాటరు తాగాల్సి వస్తుందని వాపోతున్నారు. వెంటనే శుద్ది చేసిన నీటి ని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నల్లమలలో భారీ వర్షం
ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలోని నల్లమలలో సోమవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో నల్లమల అభయారణ్యంతోపాటు ఆత్మకూరు, సమీప గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు ఆత్మకూరు పట్టణంలో 38.6 మి.మీ. వర్షం కురిసింది. నల్లమలలో అత్యంత ప్రధానమైన రాళ్లవాగు ఒకేరోజు భారీ వర్షాలకు ఉప్పొంగడంతో సిద్ధాపురం చెరువుకు వరద నీరు చేరింది. భవనాశి, సుద్దవాగులో చెక్కునీరు లేక వెలవెలబోతున్న తరుణంలో ఉన్నఫలంగా రాత్రికి రాత్రే వర్షాలు పడడంతో పొంగి పొర్లాయి.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ