
ఆర్మీ జవాన్ల స్థలాలకు రక్షణ లేకపోతే ఎలా?
కర్నూలు(సెంట్రల్): ‘ నా పేరు ఎస్ ఏడుకొండలు. నేను ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా హర్యానాలో పనిచేస్తున్నాను. నేను కర్నూలులోని ఉల్చాలరోడ్డులో 2003లో బీఎన్ రెడ్డి అనే బ్రోకర్ నుంచి ఓ వెంచర్‌లో 61 నంబర్ ప్లాటును కొనుగోలు చేసి ఫెన్సింగ్ వేసి విధులకు వెళ్లాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్లాటు భద్రంగానే ఉండేదని, అయితే ఇటీవల పక్కన ఉన్న 60వ ప్లాటుదారులు ఆ స్థలం ఫెన్సింగ్‌ను తొలగించి వారిలో ప్లాటులో కలుపుకున్నారని, వారి చెర నుంచి విముక్తి కల్పించాలి’ అని కోరుతూ ఆర్మీ జవాన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని దేశ రక్షణ కోసం తాము అక్కడ పనిచేస్తుంటే..ఇక్కడ తమ స్థలాలకు రక్షణ లేకపోవడం బాధేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజలనుంచి వినతులను స్వీకరించి వాటికి తగు పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● కల్లూరు మండలం ఉలిందకొండ, కొల్లపల్లి తండా, ఎర్రకత్వ గ్రామాలకు కృష్ణకాంత్ స్టోన్ క్రషర్ నుంచి వెలుబడే కాలుష్యం, ఆ కంపెనీ వాహనాలతో పాడైయ్యే రోడ్లు, దెబ్బతినే చెరువు కాల్వలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు.
● తన కుమారుడు పుట్టిన ఐదు నెలల నుంచి లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి చూపించినా బాగు కావడంలేదని, వైద్యం కోసం మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వెల్దుర్తికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి కలెక్టర్‌ను అభ్యర్థించాడు.
● కర్నూలులోని గడియారం ఆసుపత్రిలో కుటుంబ శస్త్ర చికిత్సలు చేసేలా చర్యలు తీసుకోవాలని అవాజ్ నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఇక్బాల్‌హుస్సేన్, ఎస్‌ఎండీ షరీఫ్ కలెక్టర్‌కు విన్నవించారు.