
ఉన్నత స్థాయికి చేరుకోవాలి
నంద్యాల(అర్బన్): వసతి గృహంలోని బాలికలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగ వయోవృద్ధులు, సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి స్థానిక గిరినాథ్ సెంటర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం 1–2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో గదులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమాన్ని అందిపుచ్చుకొని పేద విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అర్హులైన పేద వినియోగం సద్వినియోగం చేసుకోవాన్నారు. అనంతరం వసతి గృహంలోని బాలికలతో కలిసి మంత్రి,, కలెక్టర్ భోజనం చేసి ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
● సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, గ్రామ, వార్డు సచివాలయాల అంశాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వేల్పనూరు, వెంకటాపురం, శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూర్, డోన్, బనగానపల్లె, నంద్యాల, కోవెలకుంట్ల వసతి గృహాల్లో తక్కువ శాతం అడ్మిషన్లు ఉన్నారని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రాము నాయక్, నంద్యాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, రాధిక, రయిజ్ ఫాతిమా, డీసీఓ శ్రీదేవి, ఖాదర్ బాషా, పాల్గొన్నారు.
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి