
శ్రీశైలంలో అక్రమాలకు చెక్ పడేనా?
● దేవస్థాన ఉద్యోగులతోనే
విజిలెన్స్ కమిటీ
● టికెట్ల కుంభకోణాలు ఆగేనా?
శ్రీశైలంటెంపుల్: మహాక్షేత్రమైన శ్రీశైలంలో ఒకటి కాదు, రెండు కాదు.. వందలాది అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శ్రీశైల దేవస్థాన ఈఓ మొట్టమొదటిసారిగా అధికారుల బృందంతో నూతనంగా విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ విజిలెన్స్ కమిటీ ఏర్పాటుతోనైనా దేవస్థానంలో కుంభకోణాలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి. నూతనంగా ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీలో దేవస్థాన ఉద్యోగులు నలుగురు ఉన్నారు. ప్రస్తుత విధులతో వారు సతమతమవుతున్నారు. ఇక విజిలెన్స్ బృందంలో పనిచేస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం పనిభారమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేని అధికారుల బృందంతో ప్రత్యేకంగా విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలంలో చోటుచేసుకున్న
కుంభకోణాలు ఇవీ..
● లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో గోల్‌మాల్ జరిగింది.
● రూ.150 టికెట్ల రీసైక్లింగ్, అభిషేకం టికెట్ల అక్రమాలు జరిగాయి.
● రికార్డు అసిస్టెంట్ రికార్డులను తారుమారు చేసి రూ.3.5లక్షలు తన జేబులోకి వేసుకున్నారు.
● పెట్రోల్‌బంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. దేవస్థాన ఖాతాలో డబ్బులు జమ చేయకుండా ఏకంగా రూ.41లక్షలు మల్లన్న సొమ్మును స్వాహా చేశారు.
● డొనేషన్ కౌంటర్‌లో రూ.14లక్షల అవినీతి స్కాం బయటపడింది.
● ఇటీవల మల్లన్న స్పర్శదర్శనం టికెట్ల మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయించిన ఘటనలో కేసు నమోదు చేశారు.
● మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం చేయిస్తానని భక్తుల దగ్గర నుంచి రూ.15వేలు వసూలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
● రెండు సార్లు గర్భగుడిలో హుండీల దొంగతనం చోటుచేసుకుంది.
ఇదీ దుస్థితి..
శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం చేసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ సేవ తరువాత మల్లన్నకు స్పర్శదర్శనం చేసుకునేందుకు భక్తులు ఆరాటపడతారు. అయితే క్షేత్రంలో ఆర్జితసేవల టికెట్లు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే క్షేత్రంలో వసతి గదులు పొందేందుకు, ఆర్జిత సేవ, స్పర్శదర్శనం టికెట్ల కోసం మధ్యవర్తులపై ఆధారపడుతున్నారు. భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని క్షేత్రంలో కొందరు దళారుల అవతారం ఎత్తారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్త్తూ మోసం చేస్తున్నారు.