
వాటర్ ఏటీఎంలు.. ఎనీ టైం మూత!
తుగ్గలి: ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు మూతపడ్డాయి. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలక ధనం వృథా అవుతోంది. పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి మండలాల్లో రూ.9.62 కోట్లు ఖర్చు చేసి మదర్‌ప్లాంట్లు, ఆర్‌డీ యూనిట్లు ఏర్పాటు చేయాలని 2018 చివర్లో పనులు ప్రారంభించారు. అయితే సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తిచేసి ప్రజలకు రెండేళ్ల పాటు తక్కువ ధరకు శుద్ధజలం అందించింది. తుగ్గలి మండలంలో ఉప్పర్లపల్లి, కృష్ణగిరి మండలం కంబాలపాడు, వెల్దుర్తిలో మదర్‌ప్లాంట్లు ఏర్పాట్లు చేశారు. ఈ మదర్ ప్లాంట్ల ద్వారా తుగ్గలి మండలంలో 22 గ్రామాలకు కృష్ణగిరి మండలంలో 18 గ్రామాలకు వెల్దుర్తి మండలంలో 21 గ్రామాలకు శుద్ధజలం సరఫరా చేసేవారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్‌డీ యూనిట్లలో ప్రజలు ఏటీఎం కార్డుల ద్వారా రూ. 4 చొప్పున చెల్లించి 20 లీటర్ల మినరల్‌వాటర్‌ను తీసుకెళ్లే వారు. రెండేళ్ల పాటు శుద్ధజలం సక్రమంగా సరఫరా చేశారు. అయితే ట్రాక్టర్ల నిర్వహణ బిల్లులు, సిబ్బంది వేతనాలు కాంట్రాక్టర్ సరిగా చెల్లించక పోవడంతో ఆ తర్వాత నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయింది. ప్రస్తుతం వాటర్ ప్లాంట్లు, వాటర్ ఏటీఎంలలోని పరికరాలు తుప్పు పట్టి పాడైపోతున్నాయి. కోట్లాదిసొమ్ము వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుద్ధజలం సరఫరా లేక జనం మళ్లీ బోర్లు, కుళాయి నీటిని తాగి ఫ్లోరైడ్ బారిన పడి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి ప్లాంట్లు వినియోగంలోకి తీసుకొచ్చి శుద్ధజలం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
తుప్పుపడుతున్న పరికరాలు
రూ.9.62 కోట్ల ప్రజాధనం వృథా
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
ప్రజలకు అందని శుద్ధ జలం

వాటర్ ఏటీఎంలు.. ఎనీ టైం మూత!