
మోగనున్న కల్యాణ వీణ..
శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో పలు జంటలు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకునే శుభ ఘడియలు దగ్గరయ్యాయి. రెండు నెలల తర్వాత తిరిగి శుభ ముహూర్తాలు రావడంతో ఈ నెల 26వ తేదీ నుంచి కల్యాణ వీణ మోగనుంది. మాంగల్యం తంతునా..మమజీవనం హేతునా.. కంఠేభద్మామి సుభగే..త్వంజీవశరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు మార్మోగనున్నాయి. జిల్లాలోని మహానంది, యాగంటి, నయనాలప్ప, అహోబిలం, ఓంకారం, భోగేశ్వరం, శ్రీశైలం, బుగ్గరామేశ్వరం, తదితర పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇదే సమయంలో వస్త్ర, బంగారునగలు, తదితర పెళ్లి సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక పెళ్లి ఎందరికో ఉపాధి చూపుతోంది. వస్త్ర, బంగారు దుకాణాలతోపాటు పెళ్లి మండపాలు, ట్రావెల్స్, పురోహితులు, ఫొటోలు, వీడియో గ్రాఫర్స్, సాంస్కృతిక కళాకారులు, క్యాటరింగ్, ఎలక్ట్రీషియన్స్, బ్యాండుమేళం, పూలఅంగళ్లు, ఇలా ఎందరికో చేతి నిండి పని దొరుకుతోంది. ఆయా ముహూర్తాల్లో ఆయా కేటగిరిలకు చెందిన వారికి డిమాండ్ ఉండనుంది.
బంగారు వ్యాపారం పెరగవచ్చు
శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో తప్పకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉంగరం మొదలుకుని అన్ని రకాల నగలు కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నారు. తులం బంగారం ధర రూ. లక్షకు చేరువైనా కొందరు తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు.
– పెండేకంటి సుబ్రహ్మణ్యం, బంగారు నగల వ్యాపారి, కోవెలకుంట్ల
అడ్వాన్స్ బుక్ చేసేశారు
శ్రావణ మాసంలో ఏటా అధిక పెళ్లిళ్లు జరుగుతుండటంతో ఫంక్షన్‌హళ్లనును ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. జూలై నెలలో మూడు, ఆగస్టు నెలలో 12 శుభమూహుర్తాలు ఉండటంతో ఆయా తేదీలకు సంబంధించి ఫంక్షన్‌హాల్స్‌కు అడ్వాన్స్ చెల్లించి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. చాలా మందికి ఉపాధి లభించనుంది. క్యాటరింగ్, కెమెరా, డెకరేషన్ తదితర రంగాల వారికి డిమాండ్ ఉండనుంది. – శ్రీరాముల సుబ్బారెడ్డి,
ఫంక్షన్‌హాలు యజమాని, కోవెలకుంట్ల

మోగనున్న కల్యాణ వీణ..

మోగనున్న కల్యాణ వీణ..