
ఎంపీఈడీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జనవరి నెలలో జరిగిన ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 82 మందికి గాను 67 మంది పరీక్షలు రాయగా 58 మంది ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు 20 మంది హాజరు కాగా 15 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
డీసీసీబీలో పోస్టులకు 44 మంది ఎంపిక
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంటు పోస్టులకు 44 మంది ఎంపికయ్యారు. గత ఏడాది డీసీసీబీలో 50 స్టాఫ్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 37 పోస్టులు డైరెక్ట్, 13 పోస్టులు పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల భర్తీకి ముంబాయికి చెందిన ఐబీపీఎస్‌ఈ ఏడాది ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించింది. రోస్టర్ వారిగా ఎంపికై న వారి వివరాలను ఐబీపీఎస్ డీసీసీబీకి పంపింది. డైరెక్ట్‌గా భర్తీ చేసే 37 పోస్టులకు 35 మందిని, పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేసే 13 పోస్టులకు 9 మంది ప్రకారం 44 మంది ఎంపిక అయ్యారు. డైరెక్ట్ పోస్టుల్లో 1 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పోస్టు, ఎక్స్ సర్వీస్‌మెన్ పోస్టుకు అర్హులు లభించలేదు. పీఏసీఎస్‌ల నుంచి భర్తీ చేస్తున్న వాటిలో నాలుగు పోస్టులకు అర్హులు లభించలేదు. ఆగస్టు 5న పీఏసీఎస్‌ల నుంచి ఎంపికై న 9 మందికి, ఆగష్టు 6న డైరెక్ట్‌గా ఎంపికై న 35 మంది అభ్యర్ధుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సారి పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ లేకపోవడం విశేషం.
పొలాల్లో చిరుత సంచారం
గోనెగండ్ల: మండలంలోని ఎన్నెకండ్ల, గంజిహళ్లి గ్రామ శివారులో మూడు రోజులుగా చిరుత పులి సంచారిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పశువులను పొలాల్లో వేసుకున్న షెడ్లు, గుడిసెల్లో కట్టివేసి రాత్రి ఇంటికి వెళ్తున్నారు. మంగళవారం రోజు రాత్రి ఎన్నెకండ్ల గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర తన పొలంలో వేసిన షెడ్డు దగ్గర రెండు గేదేలు, రెండు దున్నపోతులను కట్టివేసి ఉంచాడు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా అందులో ఒక దున్నపోతు లేదు. నాగేంద్రతో పాటు పాడి రైతులు కొండ ప్రాంతంలో వెతకగా.. దున్నపోతు కళేబరం కనిపించింది. ఆ ప్రాంతంలో చిరుత అడుగు జాడలు కనిపించడంతో దున్నపోతును చిరుత దాడి చేసి తినిందని గుర్తించారు. గురువారం సాయంత్రం గంజిహళ్లి గ్రామ శివారులో చిరుత కనిపించడంతో గ్రామస్తులు తెలిపారు. దీంతో రాత్రి పూట పొలాల్లో ఉండేందుకు రైతులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించి అడవిలో వదిలి వేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు తోలు రాముడు కోరారు.