
వేధింపులు లేవు.. విభేదాలు తొలగాయి
● జిల్లా అధికారుల విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు
మద్దికెర: తన కుమారుడికి తల్లి అన్నం పెట్టడం లేదు.. అవ్వాతాతలు నిద్ర పోనియ్యడం లేదు.. అని మూడు నెలల క్రితం తండ్రి చరణ్‌కుమార్ జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌కు మెయిల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శిశు సంక్షేమశాఖ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి.శారద, లీగల్ కం ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గురువారం మండల కేంద్రమైన మద్దికెరకు వచ్చారు. బాలుడి అవ్వతాతలు, చుట్టుపక్కల వారిని విచారించగా.. బాలుడికి వేధింపులు లేవని తేలింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగాయని తెలిసింది. వివరాలు.. మద్దికెర గ్రామానికి చెందిన వరలక్ష్మిని గుంతకల్లు పట్టణానికి చెందిన చరణ్‌కుమార్‌కు ఇచ్చి 2021లో వివాహం చేశారు. రెండేళ్లకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్య కాన్పుకు పుట్టింటికి వచ్చి కుమారుడికి జన్మనిచ్చింది. రేండేళ్ల పాటు పుట్టింట్లో ఉన్నా భర్త పట్టించుకోలేదు. అయతే తన కుమారుడిని వేధిస్తున్నారని బాలుని తండ్రి చరణ్‌కుమార్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భార్యాభర్తలకు సర్దిచెప్పారు. మూడు నెలల కిందట చేసిన ఫిర్యాదుకు సంబంధించి జిల్లా అధికారులను విచారణకు వచ్చారు. అయితే భార్యాభర్తలు కలిసి పోయారని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతో అధికారులు వెంటనే ఫిర్యాదుదారుడిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు. వీరి వెంట తహసీల్దార్ గుండాల నాయక్, సీడీపీఓ లలిత ఉన్నారు.