
ఆర్థ్ధిక లావాదేవీలతో హత్య
● మిస్టరీ వీడిన బెల్ట్‌షాప్‌లో వ్యక్తి హత్య కేసు ● పది మంది నిందితుల అరెస్ట్ ● నిందితుల్లో నలుగురు మైనర్లు ● రెండు పిడిబాకులు, మచ్చు కత్తి, సుత్తి, ఇనుప రాడ్ స్వాధీనం
పాణ్యం: ఐదు రోజుల క్రితం పాణ్యం గోరుకల్లు రస్తాలోని బెల్ట్‌షాప్‌లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్థ్ధికలావాదేవీల మధ్య నెలకొన్న వివాదంతోనే హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, అందులో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. గురువారం పాణ్యం సర్కిల్ కార్యాలయంలో సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన అశోక్‌చౌదరి పాణ్యం గ్రామానికి చెందిన బెల్ట్‌షాప్ నిర్వాహకుడు ముసుగు సుబ్బయ్యకు రూ. 48 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఈ మొత్తంలో రూ. 26 లక్షలు సుబ్బయ్య తిరిగి చెల్లించాడు. ఇంకా రూ. 22 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బుల కోసం సుబ్బయ్యపై పదేపదే ఒత్తిడి తెచ్చాడు. దీంతో అశోక్‌చౌదరిని అంతమొందించాలని సుబ్బయ్య కుట్ర పన్నాడు. ఈ మేరకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అశోక్‌చౌదరికి ఫోన్ చేయడంతో ఈనెల 20వ తేదీ రాత్రి 7.30 గంటలకు సుబ్బయ్య షాప్ వద్దకు చేరుకున్నాడు. కాగా పథకం ప్రకారం అశోక్‌చౌదరి కళ్లలో కారంచల్లి, తలపై సుత్తితో కొట్టి ఆపై కత్తితో ఛాతి, కడుపు, వీపున కత్తులతో పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. బెల్డ్‌షాప్ నిర్వాహకుడు ముసుగు సుబ్బయ్య, అతని కుమారుడు ముసుగు సురేష్, తెలుగుపేటకు చెందిన సల్కాపురం రమేష్, నూలుమిల్లు కాలనీకి చెందిన యనకండ్ల బాలకృష్ణ, మేకలబండకు చెందిన మండ్ల మణికుమార్, గోడన్‌చెలు కాలనీకి చెందిన అనుపూరు మాబుఉసేన్‌తో పాటు నలుగురు మైనర్ బాలురు ఈఽ హత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. 13 –15 వయస్సులోపు ఉండే మైనట్లు చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ తిరిగేవారని, వీరిని ముసుగు సురేష్ వరుసగా రెండు రోజులు విందు ఇచ్చి మచ్చిక చేసుకుని, హత్యలో పాల్గొనేలా చేసినట్లు తెలిసింది. హత్యకు పాల్పడిన 10 మంది నిందితులను పిన్నాపురం రోడ్డులోని ఏరాసు ప్రతాప్‌రెడ్డి తోట వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. మైనర్లను బాలనేరస్తుల కారాగానికి తరలించినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు పిడిబాకులు, మచ్చుకత్తి, ఇనుపరాడ్డు, సుత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.