
శాస్త్రోక్తంగా పల్లకోత్సవం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామి, అమ్మవార్లకు పల్లకోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు చేపట్టారు.
నేటి నుంచి ప్రకృతి
వ్యవసాయంపై అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయ విభాగం ఇక నుంచి వ్యవసాయ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు సేవ కేంద్రాల ఇన్‌చార్జీలకు కూడా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అన్ని వ్యవసాయ శాఖ డివిజన్ కేంద్రాల్లో అవగా హన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి తెలిపారు. ఎంపిక చేసిన వీఏఏలకు మాత్రమే మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తారని, ఇందులో ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొంటారని ఆదివారం ఓ ప్రకటనలో ఆమె వెల్లడించారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
ఆదోని అర్బన్: పెద్దతుంబళం గ్రామానికి చెందిన కురువ తిమ్మప్ప(29) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే తిమ్మప్ప ఆదివారం గ్రామంలో ఓ ఇంటి వద్ద పని చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు పెద్దతుంబళం పోలీసులు తెలిపారు. మూడేళ్ల క్రితం మృతుని భార్య అనా రోగ్యంతో మృతి చెందింది. వీరికి సంతానం లేరు.
చిరుతల సంచారం
ప్యాపిలి: మండల పరిధిలోని కలచట్ల, మామిళ్లపల్లి శివారు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కలచట్ల శివారు ప్రాంతంలోని రంగస్వామి కొండపై చిరుత సంచరిస్తోందని పశువులు కాపర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు కలచట్ల గ్రామంలో ఆదివారం దండోరా వేశారు. చిరుత సంచరిస్తున్న కొండ ప్రాంతానికి పశువుల కాపర్లు వెళ్లకూడదన్నారు. అలాగే మామిళ్లపల్లి కొండపై ఆదివారం పులిపాటి రాజు అనే పశువుల కాపరికి చిరుత పులి కనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.