
కుక్కను తప్పించబోయి..
కౌతాళం: వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు ఓ కంపెనీలో పని చేస్తూ స్నేహితులుగా మారారు. ఆదివారం సెలవు కావడంతో క్షేత్రాల సందర్శనకు బయలుదేరారు. అయితే వారి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కౌతాళం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఎల్లెల్సీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ పట్టణంలో ఓ వాచ్ కంపెనీలో పని చేస్తున్న ఇటిగడ్డికి చెందిన హైదర్, గోకూల్ గ్రామానికి చెందిన అభిషేక్, సునీల్, బెళేగేరికి చెందిన అప్పయ్య, మంజునాథ్, తారేహాళ్లికి చెందిన మణికంఠ అందరూ 22 ఏళ్ల యువకులు. వీరంతా శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం ఉదయం మంత్రాలయం చేరుకుని బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొప్పల్‌లోని గవి మఠాన్ని సందర్శించుకునేందుకు మధ్యాహ్నం కౌతాళం మీదుగా వెళ్తుండగా మార్గమధ్యలో లక్ష్మీనగర్ సమీపంలో ఎల్లెల్సీ వంతెన వద్ద కుక్క అడ్డు వచ్చింది. కుక్కను తప్పించబోయే ప్రయత్నంలో కారు ఎల్లెల్సీలోకి దూసుకెళ్లింది. కారు డోర్‌లు ఓపెన్ చేసుకుని బయటపడిన యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకు పోతుండగా అక్కడే ఉన్న లక్ష్మీనగర్‌కు చెందిన గొట్టయ్య, గోవర్ధన్, రమేష్‌లు చీరలు, తాటి మట్ట సహాయంతో మంజునాథ్, అభిలాష్, అప్పయ్య, హైదర్‌ను కాపాడాగలిగారు. సునీల్ (22), మణికంఠ (21) ప్రవాహంలో కొట్టుకు పోయారు. సమాచారం అందుకున్న ఆదోని ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ వసంతకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో గాలించగా సునిల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కాగా మణికంఠ మృతదేహం లభించలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం, కౌతాళం తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి, సీఐ అశోక్‌కుమార్, ఎల్‌ఎల్‌సీ డీఈ షఫీ, ఏఈ ఈశ్వర్‌లు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఎల్లెల్సీలోకి దూసుకెళ్లిన కారు
ఒకరు మృతి, మరొకరు గల్లంతు
మరో నలుగురిని కాపాడిన స్థానికులు

కుక్కను తప్పించబోయి..