
చాగలమర్రిలో దొంగ హల్‌చల్
● ఐదు ఇళ్లలో చోరీకి యత్నం
చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలో ఓ దొంగ హల్‌చల్ చేశాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దండగుడు చోరీకి యత్నించాడు. శనివారం తెల్లవారుజామున స్థానిక మెయిన్ జారులో ఉన్న బైసాని మురళి అనే వ్యక్తికి చెందిన కిరాణ షాపుతో పాటు మరో దుకాణం తాళాలు పగులగొట్టాడు. అయితే లోపలి వైపు వాకిలి ఉండటంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలాగే చిన్నమాకానం వైపు ఉన్న తోమ్మండ్రు గురుప్రసాద్, సుంకు ఆనంద్, గాంధీ సెంటర్ సమీపంలో రామాలయం ఎదరుగా ఉన్న బింగుమళ్ల సుదర్శన్ ఇంటి ప్రధాన ద్వారాలు పగులగొట్టాడు. అయితే ఏ ఇంటి లోపలికి వెళ్లలేదు. దుండగుడి చర్యలు సీసీ రికార్డుల్లో నమోదయ్యాయి. సీసీ ఫుటేజీలో కనిపించిన నిందితుడు చాగలమర్రికి చెందిన యువకుడిగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు కసరత్తు
● మార్గదర్శకాలను జారీ చేసిన కూటమి ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్‌టీ నంబరు 599 జారీ చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 43, నంద్యాల జిల్లాలో 56 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. పీఏసీఎస్, డెయిరీ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ప్రతి పంచాయతీలో ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. దేశం మొత్తం మీద నూతనంగా 2 లక్షల సొసైటీలు నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. కొత్త సంఘాల ఏర్పాటును నాబార్డు, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ), నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ)లు పర్యవేక్షిస్తాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100కుపైగా కొత్త పీఏసీఎస్‌లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.