
మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత
● రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సులో వక్తలు ● తెలుగుతల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు భాషాభిమానుల పాదయాత్ర
కర్నూలు కల్చరల్: మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అని విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వరరావు అన్నారు. కర్నూలు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఓల్డ్‌సిటీలోని తెలుగు తల్లి విగ్రహానికి భాషాభిమానులు పూలమాలలు వేసి అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయలు, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. సదస్సులో ముక్తేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగు అధికార భాషగా ఉన్న రాష్ట్రంలో చట్టాలు, శాసన సభల తీర్మానాలు ఆంగ్లంలోనే వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లప్రదేశ్‌గా మారకుండా చుద్దామన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీర్మానాలు
తమిళనాడు రాష్ట్రం తెలుగు భాషా సంఘం అధ్యక్షులు తూమాటి సంజీవరావు మాట్లాడుతూ మాతృభాషను స్పష్టంగా నేర్చుకున్న వారు ఉన్నతంగా రాణిస్తారన్నారు. సదస్సు సమన్వయకర్త పత్తి ఓబులయ్య, సదస్సు అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, ఉపాధ్యక్షులు జేఎస్‌ఆర్కే శర్మ, కార్యదర్శి డాక్డర్ దండబోయిన పార్వతీ దేవి మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణకు ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి సదస్సును కర్నూలులో నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిథులు చేసిన ప్రతి పాదనలను తీర్మానాలుగా చేసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెండో రోజు జరిగే సదస్సులో బోధనా భాషగా తెలుగు, మాతృ భాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే అంశాలపై చర్చిస్తామన్నారు.
పుస్తకావిష్కరణ
నరసం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, డీఎస్పీ మహ బుబ్ బాషా, జంధ్యాల శరత్ బాబు, సోమయాజులు, ఈదర గోపీచంద్, స్వర్ణ రామిరెడ్డి, సహదేవ నాయుడు, మూల మల్లికార్జున రెడ్డి, తరపట్ల సత్యనారాయణ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి వివిధ జిల్లాల ప్రతినిధులు వారి మనోభావాలను పంచుకున్నారు. ముక్తేశ్వరరావు రచించిన ‘అప్పుడు రాష్ట్రం కోసం.. ఇప్పుడు భాష కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష పరిరక్షణకు రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. అతిథులు తెలుగు భాషా ఔన్నత్యాన్ని వివరిస్తూ పాడిన పాటలు, పద్యాలు ఆకట్టుకున్నాయి. నృత్య గురువు కరీముల్లా శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గాయని సుజాత పాడిన పాటలు ప్రత్యేకంగా నిలిచాయి. సాహితీ వేత్తలు శతావధాని మద్దూరు రామ్మూర్తి, డాక్టర్ వి.పోతన్న, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఎస్‌డీవీ అజీజ్ పాల్గొన్నారు.

మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత