
మూడు లక్షల ఉద్యోగాలు ఊడగొట్టిన ఘనుడు బాబు
● డీవైఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి రామన్న
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగుల్లో మూడు లక్షల మందిని తొలగించారని డీవైఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి జి.రామన్న విమర్శించారు. యువతీ, యువకులకు సీఎం చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. కార్మిక, కర్షక భవన్‌లో శనివారం డీవైఎఫ్‌ఐ 19వ జిల్లా మహాసభలు జరిగాయి. ముందుగా జిల్లా అధ్యక్షుడు జెండావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన ప్రతినిధుల సభకు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, రిటైర్డ్ వైద్యుడు శంకర్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జి.రామన్న మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. ఏడాది కాలంలోని వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది దాదాపు మూడు లక్షల మంది తొలగించి ఉపాధికి దూరం చేశారన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వాలన్నారు. స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలని కోరారు. జిల్లా నాయకులువీరేష్, హుస్సేన్‌బాషా, దాసు, సురేష్, శిరీష పాల్గొన్నారు.