
మద్యానికి బానిసలు కావద్దు
కర్నూలు: మద్యపానానికి బానిసలైతే అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా చితికిపోతారని కర్నూలు ఎక్సైజ్ జిల్లా అధికారి (ఈఎస్) ఎం.సుధీర్ బాబు అన్నారు. ప్రతి రెండో, నాలుగో శనివారాల్లో మద్యపాన, మత్తు పదార్థాల వ్యసన విముక్తిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా కర్నూలు ధర్మపేటలో కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆ శాఖ జిల్లా అధికారి సుధీర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై నైపుణ్య రహిత, అల్పాదాయ వర్గాల కార్మికులనుద్దేశించి మాట్లాడారు. మద్యపానం, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ యజమానితో పాటు ఆ ఇంట్లో ఉండే యువకులు కుటుంబ పరిరక్షణకు పాటు పడాలే తప్ప మద్యానికి బానిసలు కాకూడదని హెచ్చరించారు. కమిటీ ఫర్ ఆల్కాహాలిక్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ (కేర్) కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, ఈఎస్‌టీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్‌తో పాటు స్వచ్ఛంద సంఘాల సభ్యులు పాల్గొన్నారు.