
కాల్వబుగ్గ ఆలయంలో దోపిడీ
● ఐదు హుండీలను అపహరించిన దుండగులు
ఓర్వకల్లు: కాల్వబుగ్గ రామేశ్వరం ఆలయంలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ముఖానికి మాస్కు ధరించి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డారు. సరిగ్గా మధ్యరాత్రి 1.20 నుంచి 2.30 గంటల ప్రాంతంలో గర్భగుడి ప్రవేశ ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ పుటేజీలలో రికార్డు అయ్యాయి. గర్భగుడిలో 3 పెద్ద హుండీలు, 5 చిన్న హుండీల చొప్పున మొత్తం 8 హుండీ ఉండగా అందులో పెద్ద హుండీలను వదిలేసి, ఐదు చిన్న హుండీలను అపహరించారు. వాటిని ఆలయ సమీపంలో వాగులోకి తీసుకెళ్లి పగులగొట్టి అందులోని నోట్లను మాత్రమే తీసుకొని, చిల్లర డబ్బులు వదిలేశారు. ఉదయం వెళ్లిన ఆలయానికి వెళ్లిన స్వీపర్, పూజారి చోరీ జరిగిందని గుర్తించి ఆలయ ఈఓ మద్దిలేటికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హుండీల కోసం గాలిస్తుండగా వాగులో కనిపించాయి. అందులో దాదాపు రూ.15–20 వేల నగదు వుంటుందని భావిస్తున్నారు. ఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాల్వబుగ్గ ఆలయంలో దోపిడీ