
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి బలవన్మరణం
ఆలూరు రూరల్: కురువళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి విజేంద్ర (15) పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. కురువళ్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప, అంపమ్మ దంపతుల కుమారుడు విజేంద్ర (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదవుతున్నాడు. సరిగా చదువుకోకుండా అల్లరిగా తిరుగుతున్నావని తల్లిదండ్రులు మందలించడంతో జూన్ నెల 29వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు ఈ నెల 2వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కురువళ్లి గ్రామ సమీప పొలాల్లోని చెట్టుకు ఉరివేసుకుని వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి చుట్టు పక్క పొలాల రైతులకు ఆదివారం కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మహబూబ్ బాషా సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.